BHAGAVATA KADHA-3    Chapters   

శ్రీరామ

భా గ వ త క థ

ధర్మరాజు అశ్వమేధయాగము చేయఁదలఁచుట

4 1

శ్లో|| ఆహూతో భగవాన్‌ రాజ్ఞా, యూజయిత్వా ద్విజైర్నృపమ్‌|

ఉవాస కతిచిన్మాసాన్‌, సుహృదాం ప్రియ కామ్యయా ||

---శ్రీమద్భాగవతము. 1స్కం. 12 అ. 35 శ్లోకము.

"మఱియు ధర్మనందనుండు ... ... .... సమాయత్త యజ్ఞోపకరణుండై సకల బంధుసమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు చేసి పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించెఁ దదనంతరంబ కృష్ణుడు బంధుప్రియంబు కొఱకుఁగరినగరంబునఁ గొన్ని నెలలుండెను."

--శ్రీమదాంధ్ర భాగవతము.

ఛప్పయ.

పురుష - పురుష ప్రతి పేఖి పరీక్షా కరేఁ సబని మేఁ |

గర్భమాఁహి జో లఖ్యో, తాహి వే లఖేఁ నరని మేఁ ||

హరిహయమేధ హితార్థ, హస్తినాపుర ఫిరి ఆయే |

దేఖత దౌరే గోద, బైఠి హర్షే కిలకాయే ||

బోలే విప్ర వచన సఫల, కృష్ణ అంక మే నిరఖి సుత |

నామ 'పరీక్షిత్‌' తేఁ విదిత, హోయ్‌ఁ నృపతి అతి భక్తియుత||

అర్థము

విష్ణురాతుఁడు ప్రతిమానవునిఁ బరీక్ష చేయుచుండెను. గర్భములోఁ దా నెవరిని జూచెనో వానిని మానవులలో వెదుకుచుండెను. అశ్వమేధము చేయవలెనను సంకల్పము ధర్మరాజునకు గలిగి శ్రీకృష్ణుని మరల హస్తినాపురమునకుఁ బిలిపింపగా నాతఁడు రాఁగా నా బాలుఁడు చూచి పరువిడి వాసుదేవుని వడిలో గూర్చుండి కిలకిల నవ్వుచుండెను. అప్పుడు విప్రులతని శ్రీకృష్ణుతొడమీఁద నుండుటను గాంచి 'పరీక్షిత్‌' అను సార్థకనామమిడి, యాతఁడు మిక్కలి భక్తియుక్తుడగునని పలికిరి.

------

మానవుఁడు తన కోరిక నెఱవేరనప్పుడు దుఃఖమును జెందుచుండును. విషయభక్తుల కోరికలు నెరవేరవు. విషయ నక్తుని కోరికలు నెఱవేరవు సరిగదా, యింకను పెరుగును విషయాసక్తుఁడు గాక భగవద్భక్తుఁడైనవానికి కోరిక లుండనే యుండవు. ఆతనికి స్వతంత్రేచ్ఛ యుండనేయుండదు. ఆతఁడు తన కోరిక లన్నిటిని భగవదేచ్ఛలో సమ్మిళితము కావించును. భగవత్ర్పేరణచే నేదైన నిచ్ఛ పొడమునెడల నది యెంత కఠినమైనదైనప్పుటికి తనవద్ద నేవిధమగు సాధనము లేకపోయినప్పటికిని అది నెఱవేరితీరును. ఎవని సంకల్పముచే నీ చరాచర సృష్టి అయినదో అట్టివానికి ఈ సాంసారిక సాధారణ సామగ్రుల నెఱవేర్చు టెంతటిపని ?

పరీక్షిన్మహారాజు మిక్కిలి గారాబముతో, లోపల వెలపల నత్యంత ప్రేమతో శుక్లపక్ష క్షపాకరునివలె దినదినాభివృద్ధి చెందుచుండెను. రాణివాసములో నతఁడొక్కడే పసిబిడ్ఢఁడు , వంశాంకురమును. అందువలన నింటిలోని స్త్రీలందఱును దమప్రేమనంత నాతనిపైననే పెట్టుకొనిరి. కంటికి రెప్పలట్లాతఁడు మిక్కిలి జాగరూకతతో ఁ దన తల్లి, నాయనమ్మ, ముత్తవ్వ, పినతల్లి, పెదతల్లి మొదలగు వారలచేఁ బెంపఁబడు చుండెను. వాని కేదైన కష్టము సంభవించెనా రాణివాసమంతయు శోకాచ్ఛాదితము కాఁగా, వివిధోపచారములచేతను, వివిధోపాయములద్వారమునను దానిని శాంతింఁ జేయుచుందురు. అనేక ములగు దానములు చేయించుచుందురు. పారాయణము, దేవతార్చనము చేయించుచుందురు. లోభివాఁడు తన సొత్తు నెట్లు రక్షించుకొనునో, అట్లే ఆతని, వారు రక్షించుచుండిరనునదియే దీని సారాంశము.

పంచపాండవుల కాతఁడు బహిఃప్రాణము. అవసరపడినప్పుడు యధిష్ఠిరుఁడు ఆతని నంతఃపురమునుండి తెప్పించుకొని, తన వడిలోఁ గూర్చుండఁబెట్టుకొని గంటలకొలఁది .యాతని నాడించుచుండును. బాలకుఁడగు పరీక్షిత్తు సభలోనికి వచ్చినప్పుడెల్లను అచ్చట నుండువారల నందఱను బ్రత్యేకముగ నేకాగ్రముగఁ జూచుచుండెడువాఁడు. పుట్టినది మొద లిట్లే నలువైపులను మిక్కిలి ధ్యానపూర్వకముగఁ జూచుచుండుటను గాంచి, యాతఁడిట్లెందులకుఁ జూచుచున్నాడా యనియుధిష్ఠిరుఁడాశ్చర్య పడుచుండెను. ఆతఁ డంతఃపురస్త్రీలనుగూడ ' ఈతఁడంతఃపురములోపలఁగూడ నిట్లే చూచుచుండునా?' యని యడిగెను.

దాసీజనము చేతులుజోడించి యిట్లనిరి:- " దేవా! ఈతఁడంతఃపురములో మిక్కిలి సౌమ్యముగ నుండును. ఆతఁడు తన తల్లివైపునై నను సరిగాఁ జూడఁడు; కాని బయటకు రాఁగానే యెవఁడైన నతని యెదుటకు వచ్చెనా వానిని మిక్కిలి జాగరూక తతోఁ దదేకదృష్టితోఁ జూచుచుండును."

ధర్మరాజునకు బాలుఁడిట్లెందులకుఁ జూచుచున్నాఁడా యను నాశ్చర్య మెక్కుడయ్యెను. ఆతఁడు విద్వాంసులగు బ్రాహ్మణులను, జ్యోతిష్కులను, పండితులను, బురోహింతులను బిలిపించి దీనికి కారణ మేమిని యడిగెను. అంత వా రిట్లనిరి:- " ఈతఁడెవరినో వెదుకుచున్నాఁడు."

"ఎవరిని వెదుకుచున్నాఁడో? తన తండ్రినా ? లేక ఏదైనా దేవతనా? ఋషినా?" అని ధర్మరాజనెను.

బ్రాహ్మణులిట్లనిరి :- "మహారాజా ! ఈతఁడు తండ్రిని జూడనే చూడలేదు. ఈతఁడొకానొకనిని గర్భములోఁ జూచి నాఁడు. ఈ మానవులలోఁ దనను గర్భములో రక్షించినవాడెఁడో నని యాతఁడు వెదుకుచున్నాఁడు. మనుష్యులలో నాతఁడు వానినిఁ గానక క్రొత్తగా వచ్చినవారిలో నెడైన నట్టి వాఁడు లభించునేమోనని వెదుకుచున్నాఁడు. అందఱను బరీక్షించుటచేతనే యీతనికి 'పరీక్షిత్‌' అను పేరు సార్థకము కాఁగలదు. 'విష్ణురాతుఁడు' అను పేరు చాల కొలదిమందికే తెలియును; కాని పరీక్షిత్తను నామ మందఱనోట నాట్యమాడును." ధర్మరాజున కాశ్చర్యమయ్యెను. ఆ దినము నుండి యాతనిని బరీక్షి త్తని పిలుచుచుండెను. రా జట్లు పిలుచుటచే నందఱు నట్లే పిలుచుచుండిరి. అప్పటినుండి యాతఁడు పరీక్షిన్నామముచే బ్రసిద్ధిఁ జెందెను.

శత్రువులు మడసిరి. పోయిన రాజ్యము మరల నాతనికి లభించినది. భూమిమీఁదఁగల రాజులందఱును దనకు వశ##మైరి. వంశాభివృద్ధిని గలిగించు మనుమఁడుకూడ పుట్టినాఁడు. అతం ధర్మరాజిట్లా లోచించెను:- "నేను కులసంహారము గావించితిని. జాతిద్రోహ పాపమంటినది. బంధుమిత్రాదులను జంపితిని. కావున దీనికిఁ గొంచెము ప్రాయశ్చిత్తము జరుగవలయును." ఇట్లాలోచించి యాఁతడు వ్యాస, ధౌమ్య, కృపాచార్యాది కులపూజ్య పురోహితులను, ఇతరజ్ఞానులను, మునులను, ఋషులను, వేదజ్ఞులగు బ్రాహ్మణులను బిలిపించి తన మనోభావమును వల్లడించి "ఈ జాతి ద్రోహ పాపమునకు నేనే ప్రాయశ్చిత్తమును జేసికొన వలసియుండు" నని యడిగెను.

అంత బ్రాహ్మణులు విచారించి యిట్లనిరి:- "రాజా! శస్త్రమును గైకొని యుద్ధము చేయుటకు వచ్చిన శత్రువును జంపుట క్షత్రియునకుఁ బాపముకాదు. ఇదిగాక యుద్ధములో ననేకములగు పాతకములు, ఉపపాతకములు లభించుచుండును. యుద్ధము పూర్తియైనతర్వాత రాజు అశ్వమేధ యజ్ఞము జేసిన నాతఁడు సర్వపాపములనుండియు విముక్తినిజెంది నిష్పాపి కాఁగ లఁడు. నీవుకూడ నొక యశ్వమేధ యజ్ఞమును జేసి యుద్ధజనిత దోషమును బోఁగొట్టుకొని నిర్దోషివి కమ్ము. వాస్తవమునకు నీ విప్పుడును నిర్దోషివే. కాని నీ విప్పుడు లోకసంగ్రహము కొఱకును, ధర్మమర్యాదకొఱకును జేయఁదలఁచినదంతయుఁ జేయుము. అది చాల మంచిది."

ధర్మరాజు దుఃఖితుఁడై యిట్లనెను:- " బ్రాహ్మణులారా ! నా పాపము యుద్ధము చేసిన యితర రాజుల పాపమునకు మించినది నేను ముఖ్యముగ మూఁడు ఘోరపాపములొనర్చితిని. మొదటిది నా బాంధవులను, కులగోత్రీయులను జంపితిని; రెండవది అవధ్యులగు భీష్మద్రోణాది గురుజనములఁ బొలియించితిని; మూఁడవది మూర్ధాభిషిక్తులును, ధర్మాత్ములు నగు వేలకొఁది రాజన్యుల వధియించితిని. ఈ విధముగ బంధువధ, గురువధ, రాజవధ యను నీ మూఁడు మహాపాతకములు నా మూలమున జరిగినవి. కావున మీరు నాచే మూఁ డశ్వమేధయాగములను జేయింపుడు."

ధర్మరాజుని యీ వచనములను విని యందఱు నైక్య కంఠమున "సాధు సాధు' అనిరి. బ్రాహ్మణ లానందమున నిట్లనిరి:- "ధర్మావతారా ! ఇది మీకనురూపముగనే యున్నది. మీలో పాపము లేనేలేదు. లేకున్న నింకఁ బోవలసిన దేమున్నది ? కాని, మూఁడు యజ్ఞములచే మీకీర్తి సమస్త భూమండలమున నింకను వ్యాపింపఁగలదు. మీ యభిప్రాయము చాల బాగున్నది. మే మందఱము నుత్తమ పద్ధతిని మీ యజ్ఞ ములను బూర్తి చేయించెదము. సమస్త యజ్ఞములకు నధిపతి యగు శ్రీకృష్ణుని మీరు పిలిపింపుఁడు. యజ్ఞము లన్నియు నాతని ప్రసన్నత కొఱకే చేయఁబడు చుండును. ఆయన విచ్చేయుటే యుద్ధమునకు సర్వశ్రేష్ఠమగు సిద్ధిగాఁదలఁచు చుందురు. ఆతఁడు విచ్చేసెనా నీ యజ్ఞములు నెఱవేరినట్లే."

ధరణీసురుల యాజ్ఞచే ద్వారకనుండి తిరిగివచ్చిన ధనంజయునిఁ బురోహితుఁడగు ధౌమ్యునితో ధర్మరాజగు యుధిష్ఠిరుఁడు వాసుదేవుని దోడ్కొని వచ్చుటకు మరల ద్వారకాపురికిఁ బంపెను. పాండవాగ్రజుని సందేశమును వినుటతోడనే వాసుదేవుఁడు బంధు మిత్ర పరివార సమేతముగా మరల హస్తినాపురమునకు విచ్చేసెను. నగరమున మరల నానందము వెల్లివిరిసెను. నగరవాసు లందఱును నారాయణుని దర్శింప నుత్కరంఠతతో నుండిరి. మిక్కిలి వైభవముతో, మేళతాళములతో ధర్మారాజు వాసుదేవునకు స్వాగత సత్కారములు కావించెను. బహుమానములతో నాతనిని సభా భవనమునకుఁ గొనివచ్చెను. అచ్చట పురోహితులు విధ్యుక్తముగ విశ్వేశ్వరు నర్ఘ్య పాద్యాదులచేఁ బూజించిరి. ధర్మరా జాతనినిఁ గుశల ప్రశ్నకావించెను. శ్రీకృష్ణుఁడుకూడ ధర్మరాజుయొక్క రాజకోశ, మంత్రి, పురోహిత, అంతఃపుర , సేనా, నగరాదులను గూర్చి కుశలప్రశ్న కావించెను. ఇంతలోనే సహదేవుఁడు బాలకుఁడగు పరీక్షిత్తును దీసికొనివచ్చెను. చిన్నావాఁడైనప్పటికిని శ్రీకృష్ణునిఁ జూడఁగానే బలపూర్వకముగ జంకనుండి దూఁకెను. సహదేవుఁడెంతగ వారించుచున్నను నాతఁ డాగలేదు. బాలకుని యీ హఠమును గాంచి దూరమున నుండియే ధర్మరాజిట్లనెను:- "సహదేవా! వీనిని విడిచిపెట్టుము, ఏమిచేయునో చూతము."

ధర్మరాజుని యాజ్ఞచే సహదేవుఁడు వానిని సభాస్థలిని క్రింద వదలెను. ఆతఁడు మిక్కిలి వేగముగ మోఁకాళ్ళమీఁదఁ బాఱకాడుచు శ్రీకృష్ణుని వైపునకుఁ జరచర పోయి, సింహాసనమును సమీపించి యాతని పాదములను బట్టుకొని వడిలోని కెక్కి కూర్చుండి, తదేకదృష్టితోఁ జక్రిని జూచుచుండెను. అందఱును బాలకుని యీ పనినిఁ గుతూహలముతో జూచుచుండిరి. బాలకుఁడు మాటిమాటికి వాసుదేవుని జూచి యానందించుచుండెను. భగవానుని శ్రీహస్తములను గాంచి యాశ్చర్యముద్రను బెట్టుకొని చూచుచుండెను.

అంత ధర్మరాజు వ్యాసునిగాంచి యిట్లడిగెను:- "స్వామీ! ఈ కుఱ్ఱఁడు భగవన్ముఖారవిందమును గాంచి ప్రసన్నుడై కరకమలములను గాంచి యాశ్చర్యచకితుడగుట యేల?"

వ్యాసభగవానుఁడిట్లనెను:- " రాజా ! ఈతఁడు గర్భములో గదనుగొని తననురక్షించునప్పుడు కమలాక్షుని గాంచెను. ఇప్పుడు ముఖమును జూచి గుర్తించి, చేతులలో గదనుగానక యాశ్చర్యచకితుఁ డగుచుండెను. వాసుదేవుఁడు మరల గదా ధారరిగఁ గనఁబడి తన చతుర్భుజ రూపమును జూపెనా యాతఁడత్యంత ప్రసన్నతఁ జెందఁగలడు."

వ్యాసధర్మరాజులు చెప్పినమీఁదట శ్రీకృష్ణుఁడు చతుర్భుజ రూపమున శంఖ చక్ర గదా పద్మములతో దర్శన మొసంగెను. ఆ రూపమును జూడఁగానే బాలకుఁ డత్యంతాహ్లాదమున భగవానుని గౌఁగలించుకొనఁగా వాసుదేవుఁ డాతని ముద్దాడి లాలించెను.

ఇఁక నశ్వేమేధ సన్నాహమును జేయఁదొడఁగిరి. ధర్మరాజిట్లనెను:-"వాసుదేవా ! నేను సర్వోత్కృష్టమగు నశ్వేమేధ యజ్ఞమును జేయఁబూనినసంగతి నీకు విదితమే. ఇంతకు, ఒక్కటికాదు. మూఁడు యజ్ఞములు చేయఁదలఁచినాను. యజ్ఞ యాగాదులకై రాజులకు ధనము ప్రజలపన్నులమూలముననైన రావలయును, లేదా దండము మూలమునైన రావలయును. నేను విశేషముగఁ బ్రజలపైఁ బన్నుల విధించి ద్రవ్యమును సేకరింపను. దండమున ద్రవ్యసంచయముఁజేయు కోరికయు నాకు లేదు. అన్యరాజన్యులనుండి ధనమును గొందమన్న వారు భారతయుద్ధములోఁ దీవ్రముగఁ బోరి చాల నష్టపడిరి.కౌరవులు తమ కోశమునంతను యుద్ధములో వ్యయము కావించిరి. ద్రవ్యము లేక నా యజ్ఞము సాగంగోపాంగముగ నెఱవేఱు టెట్టులా యని నా చింత ? నాకున్న ద్రవ్యము నీవే నీవు వచ్చితివి కావున మాయజ్ఞము నెఱవేరినట్లే. ఇప్పుడు నీ వెట్లు చేయింపఁదలఁచిన నట్లు చేయింపుము. ఇఁక నిశ్చింతుఁడనైతిని" ఇట్లని తన సర్వభారమును శ్రీకృష్ణునిపై నుంచి, తన కోరికను గృష్ణార్పణము కావించి, ధర్మరాజు మెదలకుండెను.

ధర్మరాజు మెదలకుండిన తర్వాత వాసుదేవ భగవానుఁడాతనితో నిట్లనెను :-"మహారాజా! నీవు దేనిని గూర్చియుఁ జింతింపవలదు. నేను నీ మనోరథము లన్నిఁటినిఁ బూర్తి కావించెదను. నీవు వసుంధరాధిపతివైతివి, నీకు ధనమున కేమి కొదువ? రాజు పాపియైనప్పుడు, ఆ పాప కారణమునఁ బృథ్వి తన రత్నముల నన్నిటిని దాఁచుకొనును. పాపియు, నీచుఁడును, నధర్మాత్ముడును నగు రాజు ధనమునకుఁ బరముఖము నపేక్షింపవలయును. అట్టివాఁడు ప్రజలపైఁ బన్నులపై ఁ బన్నులు వేయుచుండును, ఋణము లడుగుచుండును. ప్రజల బాధించుచుండును. అయినను వానికి డబ్బు లభింపదు. బుద్ధి, సిద్ధి, సమృద్ధి భావానుసారముగ నుండును. ధర్మాత్ముఁడగు రాజున కీ పృథ్వి కామధేను వగును. (నసుం+ధరా యనఁగా వసు=ధనమును, ధరా=ధరించినది అను నీ యర్థము సార్థకము కాగలదు.) నీకు ధనమున కేమి కొదువ? పూర్వకాలమునఁ గరంధమ మహారాజునకు మరుత్తను యశస్వియగుఁ బుత్రుఁడుండెడివాఁడు. ఆతఁడు తన కులగురువగు సంవర్తకుని సహాయముచే నొక మహాయజ్ఞమును గావించెను.అట్టిదాని నింతవఱ కెవఁడును జేయనులేదు; ఇఁకఁ జేయఁగలవాఁడుండఁడు. ఆ యజ్ఞములో యజ్ఞ సామానులన్నియు సువర్ణములే. ఇంతయేల? భవన ప్రాకారాదులన్నియు సువర్ణకములే. ఆ యజ్ఞములో బ్రాహ్మణులకు దానము వారెత్తలేనంతగ సువర్ణము నొసంగెను. దాని నచ్చటనే విడిచివచ్చిరి. అచ్చట సువర్ణ యజ్ఞసామగ్రిని ఎద్దుబండ్లు, ఏనుఁగులు, ఒంటెలు మోయవలసి వచ్చెను."

ధర్మరాజిట్లనెను:- "వాసుదేవా ! బ్రాహ్మణులు విడిచి వెళ్ళిన మిగిలిన యజ్ఞసామగ్రి పై మన కధికార మేమున్నది ? దానితో యజ్ఞముచేయుట ఉచితమా ?"

వాసుదేవుఁడిట్లనెను :- " రాజా ! నీవు సమస్తధారాతల మునకుఁ జక్రవర్తివి. భూమిపైఁగల వన, కానన, పర్వత, వృక్ష, ధాతువు లన్నిటిమీఁద మీకధికారము కలదు. ఆ ధనముపై నీకు సంపూర్ణ స్వత్వమున్నది. నీవు శివునిఁ బూజించి నిశ్శంకుఁడవై యా ధనమును దెప్పించుకొని, దానితో యజ్ఞసంభారము లన్నిటి నేర్పఱచుకొని యజ్ఞములను బూర్తి కావించుకొనుము."

ధర్మరాజిట్లనెను:- " వాసుదేవా ! మీ యాజ్ఞ యగు నెడల ననుచితమైనను నుచితము కాఁగలదు. విధి నిషేధము లేర్పఱచినవాఁడ వీవే కదా ! నేను మరుత్తుని యజ్ఞ వృత్తాంతమును, ఆతని కింతటి ధనప్రాప్తి యెట్లు కలిగినదియు సంపూర్ణముగఁ వినఁదలఁచుచున్నాను. దానిని వివిన మీఁదట నా ధనమును దెచ్చుకొని యజ్ఞారంభమును గావించెదను".

శ్రీకృష్ణుఁడిట్లనెను:- " రాజా ! మరుత్తుని చరిత్రము నంతయు సత్యవతీ నందనుఁడగు వ్యాసభగవానుఁడు చెప్పఁగలఁడు." అని శ్రీకృష్ణుఁడూరకుండెను.

ఛ ప్ప య

సోచేఁ రాజా హనే నృపతి సంబంధీ సబ ఈ |

జబహోవేఁ హయమేధ టరింగే పాతక తబ ఈ ||

మమచింతాతేఁ భలా కహో కా కాజ నరింగే|

వేహోవేఁ సంపన్న జాహి శ్రీకృష్ణ కరింగే||

హరిభక్తని కే కాజ ప్రభు, కరతా బని కరతేఁ కరేఁ |

జే శరణాగత హ్వై గయే, తినకే సబ దుఖ హరిహరేఁ ||

అర్థము

ధర్మరాజిట్లు తలఁచెను:- నేను బంధువులను, స్నేహితులను, రాజులను జంపితిని. అశ్వమేధయజ్ఞము చేసిన నీ పాపము లన్నియుఁ బోఁగలవు. నాచింత తీరుట కే కార్యము చేయవలయునో చెప్పవలయును. ఆ సమస్తమును శ్రీకృష్ణుఁడు నెఱవేర్చఁగలఁడు.

హరిభక్తుని కార్యము లన్నియు ప్రభువే నెఱవేర్చుచుండును. ఎవరాతనికి శరణాగతులైరో వారి దుఃఖముల నన్నిటిని హరియే హరింపఁగలఁడు.

BHAGAVATA KADHA-3    Chapters